Geetha Koumudi-1    Chapters   

అ యి ద వ కి ర ణ ము

దృతరాష్ట్రుని ప్రశ్న

(గీత - 1వ అధ్యాయము)

భగవద్గీత అంతను అనగా ఏడువందల శ్లోకములను విషయ వారీగా విమర్శించినయెడల నాలుగు భాగములుగా తేలును.

1. ధృతరాష్ట్రుని ప్రశ్న - (ఒకటవ శ్లోకము)

2. అర్జునుని విషాదము - ఒకటవ అధ్యాయము రెండవ శ్లోకమునుండి రెండవ అధ్యాయము (పదియవ శ్లోకమువరకు)

3. కృష్ణునిబోధ - (రెండవ అధ్యాయములో పదకొండవ శ్లోకము మొదలు 16 వ అధ్యాయము 66వ శ్లోకము వరకు)

4. ఫలశ్రుతి- (18 లో 67 మొదలు చివరివరకు)

పై విధముగా గీతనంతను విభాగము చేసిన తర్వాత గీతలోని ప్రతి అధ్యాయమును విషయవారీగా విమర్శించిన యెడల విషయము చక్కగా బోధపడును గనుక అట్టి విభాగమును గావించుదము.

గీతలోని మొదటి అధ్యాయమునకు అర్జున విషాద యోగమని పేరు. ఈ అధ్యాయములో 47 శ్లోకములున్నవి. ఈ 47 శ్లోకములేకాక రెండవ అధ్యాయములోని మొదటి పది శ్లోకములును గూడ విషాదయోగమునకు చెందినవై యున్నవి. రెండవ అధ్యాయము పదకొండవ శ్లోకము మొదలుకొని కృష్ణునిబోధ ప్రారంభము. ఇట్లు అర్జున విషాదయోగమునకు సంబంధించిన (47+10) 57 శ్లోకములను విషయవారీగా విమర్శించినచో 6 భాగములుగా తేలును.

1. ధృతరాష్ట్రుని ప్రశ్న - (ఒకటవ శ్లోకము)

2. ఉభయసేనల వర్ణన - (2వ శ్లోకము మొదలు 11 వరకు)

3. శంఖములు పూరించుట - (12వ శ్లోకము మొదలు 19 వరకు)

4. అర్జునునిచే ఉభయసేనల సమీక్ష- (20 మొదలు 27 వరకు)

5. అర్జునుని విషాదము - (28 మొదలు 46 వరకును, రెండవ అధ్యాయములో 1 మొదలు 8 వరకును)

6. అర్జునునిచే యుద్ధవిరమణ - (1లో 47, 2లో 9, 10).

పై ఆరు విషయములను విపులముగా విమర్శించుదము.

1. ధృతరాష్ట్రుని ప్రశ్న :-

శ్లో || 'ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః |

మామకాః పాండవాశ్చైవకిమకుర్వత సంజయ' ||

అనునది ధతరాష్ట్రుని ప్రశ్న,

కౌరవులకును పాండవులకును ఆస్తివిషయమై కలహము లేర్పడగా ఉభయులును కురుక్షేత్రములో యుద్ధము చేయుటకు సన్నద్ధులైరి. ధృతరాష్ట్రుడు గ్రుడ్డివాడగుటచే యుద్ధవార్తలను తెలుసుకొనవలెనని వాంఛ కలుగగా, వ్యాసులవారు సంజయుని యుద్ధవార్తలు చెప్పుటకుగాను నియోగించినారు. యుద్ధము మొదటి 10 రోజులును భీష్ముని సేనానాయకత్వమున జరిగి 10వ రోజున భీష్ముడు పడిపోయెను. అంతట సంజయుడు కురుక్షేత్రమునుండి హస్తినాపురమునకు వచ్చి ధృతరాష్ట్రునితో

''హతో భీష్మశ్శాంత నవో భరతానాం పితామహః'' అనగా భీష్ముడు పడిపోయెను. అని చెప్పెను. ఆ సంగతి ధృతరాష్ట్రుడు వినగానే దుఃఖములో మునిగిపోయి కొంతసేపటికి తెప్పరిల్లి సంజయుని

''ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమ వేతాయు యుత్సవః |

మామకాః పాండవాశ్చైవ కిమ కుర్వత సంజయ'' ||

అని అడిగినాడు. ఈ ప్రశ్న అడుగుటకు పూర్వమే యుద్ధము ప్రారంభ##మై 10 రోజులు గడిచి భీష్మపతనముగూడ సంభవించుటచేత, అట్టి పరిస్థితి ననుసరించియే ఈ శ్లోకమునకు మనము అర్థము చెప్పుకొనవలెను.

అప్పడు ఈ శ్లోకమునకు అర్థ మేమనగా :-

1. ధర్మక్షేత్రమైన కురుక్షేత్రములో మావారున్ను (కౌరవులు), పాండవులున్నూ యుద్ధము చేయుటకు సన్నద్ధులై ఏవిధముగా యుద్ధము చేసిరో, మొదటినుండియు ఏమి జరిగినదో అంతా వివరముగా చెప్పుము అని అర్థము చెప్పదగియున్నది.

'ధర్మక్షేత్రే' అను శబ్దమును బట్టిన్ని ఇతర సందర్భములను బట్టిన్ని ధృతరాష్ట్రుని మనస్సులో దిగువ నుదహరించిన భావములు కలిగియుండవచ్చునని యూహించవచ్చును. ఆవిధముగా జూచినచో మొదటి శ్లోకమునకు పై అర్థమేగాక ఈ దిగువ అర్థములనుగూడా చెప్పుకొనవచ్చును.

2. పాండవులు ధర్మాత్ములు గనుక వారు ధర్మ క్షేత్రమైన కురుక్షేత్రములో ప్రవేశించగానే వారి ధర్మబుద్ధి వృద్ధియై యుద్ధవాంఛ పోయి వారు యుద్ధము చేయక వెళ్ళిపోయి యుందురేమో, అట్లయిన మావాళ్ళకు నిరాటంకముగా రాజ్యము ప్రాప్తించవచ్చును. అని అనుకున్నాను; కాని సంజయా! అట్లు జరుగక ఏమి జరిగినదో చెప్పుము. ఇది 2వ అర్థము.

3. మావారు అధర్మాత్ములైనను ధర్మక్షేత్రమైన కురుక్షేత్రములో కాలు పెట్టగానే వారికున్న అధర్మబుద్ధి పోయి పాండవులు రాజీగా కోరిన ఐదు గ్రామములును వారికి యిచ్చుటకు అంగీకరించినచో యుద్ధము జరుగకుండా యుండవచ్చును అని అనుకొన్నాను. అట్లుగూడా జరుగక ఏమి జరిగినదో చెప్పుము సంజయా! అని 3వ అర్థము.

4. మా సైన్యములో జయించుటకు సాధ్యముకాని భీష్మ ద్రోణాదులు ఉన్నారు గనుక వారినిజూచి పాండవులు భయపడి అట్టి దృష్టభయముచేత యుద్ధమునే మానుకుంటారేమో అనికూడా తలచినాను. అట్లుకూడ జరుగక ఏమి జరిగినదో చెప్పు సంజయా! అని 4వ అర్థము.

5. ధర్మాత్ములైన పాండవులు ధర్మముగా యుద్ధము చేసినచో భీష్ముని పకగొట్టుట సాధ్యముకాదు కనుక పాండవులు భీష్ముని పడగొట్టుటకు అధర్మయుద్ధము చేసినారా ఏమి చెప్పు సంజయా! అని 5వ అర్థము.

6. 'కిమ కుర్వత' అను దానిని ప్రశ్నార్థకముగా కాక ఆక్షేపార్థకముగా తీసుకొనినచో అప్పుడు తేలిన అర్థమేమనగా - ధర్మాత్ములనిపించుకొనిన పాండవులు భీష్ముని పడగొట్టినారంటే ఎంత అధర్మమైన ఘోరకృత్యము చేసి నారో కదా! అని 6వ అర్థము.

7. భీష్ముడు పడిపోయినా అజేయులగు ద్రోణుడు, కృపుడు, కర్ణుడు, అశ్వత్థామ మున్నగువారున్నారు గనుక వారివలననైనా మాకుజయము లభింపకపోవునా! అని ఆశతో నున్నాను. సంజయా! ఏమి జరిగినదో చెప్పుము. అనగా పర్యవసాన మేమగునో చెప్పుము అని ధృతరాష్ట్రుని ప్రశ్నలో భావ మిమిడియున్నది అనికూడా ఊహించవచ్చును. ఏల ననగా ఇట్టి భావమునకు జవాబుగానే సంజయుడు గీతలోని చివర శ్లోకములో,

''యత్రయోగేశ్వరః కృష్ణః - యత్రపార్ధో ధనుర్థరః|

తత్ర శ్రీర్విజయోభూతిః - ధృవానీ తిర్మతిర్మమ'' |

అనగా కృష్ణుడు అర్జునుడు ఎక్కడఉంటే అక్కడ జయము అని చెప్పినాడుకదా! ఇది 7వ అర్థము.

8. గీతలోని మొదటి శ్లోకములోని ధృతరాష్ట్రుని ప్రశ్నకు పైన చెప్పిన 7 అర్థములున్నూ చరిత్రాత్మకంగా చెప్పబడినవి. గీత కేవలము భారతీయులను మాత్రమే తరింపచేయుటకు అవతరించిన గ్రంథము కాక, ప్రపంచములోని మానవులందరిని తరింపచేయుటకు పుట్టిన ప్రపంచ మతగ్రంథముగదా! గీతలోని - శ్లో|| 'మమవర్త్మానువర్తన్తే మనుష్యాః పార్థసర్వశ.' (4-11) శ్లో|| 'అన న్యా శ్చింత్గయంతో మాం| యేజనాః పర్యుపాసతే' (9-22) శ్లో|| 'యస్త్వాత్మ రతిరేవస్యాతో ఆత్మతృప్తశ్చ 'మానవః' (3-17) ఈమున్నగు గీతాశ్లోకములలోని 'మనుష్యాః' 'జనాః' 'మానవః' మున్నగు పదములు గీత ప్రపంచములోని మానవులందరిని ఉద్దేశించి అందరిని తరింపజేయు గ్రంథరాజమని వక్కాణించుచున్నవి. అట్లైనచో ఈ గీతనాటకములోని ధ్రతరాష్ట్రుడు, సంజయుడు, కృష్ణుడు, అర్జునుడు అను నలుగురు పాత్రలు హిందూ మతమునకు సంబంధించినవారు కాని యితరులకు సంబంధించినవారు కాదు గనుక, గీత ఎట్లు విశ్వమానవ మతగ్రంథము కాగలదు? అను ప్రశ్న వచ్చును. అందుకని ఆనాల్గు శబ్దములకు చరిత్రాత్మకమైన అర్థమేగాకుండా సర్వమానవులకు సంబంధించే ఆధ్మాత్మిక అర్థం కూడ చెప్పుకోవలసి యున్నది. అట్లు చెప్పినచో ఆశబ్దములకు వచ్చు అర్థము ఏమి అనగా (1) 'ధ్రతరాష్ట్రుడు' అను శబ్దమునకు అర్థము రాష్ట్రము అను శరీరమును ధరించినవాడు అనగా దేహమే నేననుకొను అజ్ఞాని. ధృతరాష్ట్రుడు గ్రుడ్డివాడు గనుక ఆ భావమునకు ఆధ్యాత్మికార్థము చెప్పుకొన్నపుడు, జ్ఞాన నేత్రము లేని దేహతాదాత్మ్యంగల అజ్ఞాని అని అర్థము;

2. 'సంజయుడు' - అనగా మంచి జయము కలవాడు, ఇంద్రియజయము, మనోజయము, అవిద్యాజయము గలిగిన జ్ఞాని అని అర్థము. ధృతరాష్ట్రుడు సంజయుని ప్రశ్న అడుగుచున్నాడనగా, అజ్ఞాని అగు శిష్యుడు జ్ఞానియగు గురువును తరుణోపాయమును గురించి ప్రశ్న అడుగుచున్నాడని అర్థము. ఇట్టి పరిస్థితులలో ధృతరాష్ట్రుడు, సంజయుడుఅను శబ్దములు సర్వమానవవ్యాప్తి గలవి అగుననుటలో సందేహముండనేరదు. ఇటులనే 'కృష్ణుడు' అను శబ్దమునకు భగవంతుడనిన్నీ; 'అర్జును'డనగా భక్తుడగు జీవుడనిన్నీ చెప్పుకొన వచ్చును.

ఇకను 'ధర్మక్షేత్రే కురుక్షేత్రే అను మొదటి శ్లోకమునకు ఆధ్యాత్మిక అర్థమును చెప్పుకొన వలసి యున్నది. అది ఏమనగా 'కురుక్షేత్ర' మనగా 'శరీరము' అని అర్థము. 'కురు' అనగా ఇంద్రియములు అని అర్థము గనుక, కురుక్షేత్రమనగా ఇంద్రియముల కాధారమైన శరీరము అని అర్థము. ఇట్టి ధర్మక్షేత్రమని వర్ణింపబడుటచేత ఈ శరీరము ధర్మము అనే పంటను తద్వారా జ్ఞానమనే పంటను పండించుటకు తగిన సాధనము అని తేలును. క్షేత్రమనగా పొలమని అర్థమున్నదికదా! పొలము అనగా పంటను పండించేదేకదా! కనుక శరీరమను క్షేత్రము గూడా ధర్మము జ్ఞానము అను పంటలను పండించుటకుగాను మనకు భగవంతునిచే అనుగ్ర హింపబడినదని మనము తెలిసికొనవలసియున్నది. ఆ శ్లోకములోని 'మామకాః' 'పాండవాః' అను శబ్దములకు కౌరవులు, పాండవులు అని చరిత్రాత్మకమైన అర్థము.

ఇక ఆధ్యాత్మిక అర్థము ఏమనగా 'మామకాః' అనగా నావాళ్ళు అనుటలో రాగముతో కూడినవారు కనుకను, రాగము రజోగుణమువల్లను తమోగుణమువల్లను పుట్టునది గనుకను, 'మామకాః' అనగా రజోగుణ తమోగుణములని అర్థము. 'పాండవాః' అనుటలో పాండు అను శబ్దములో తెలుపు స్వచ్ఛత అను భావములు యిమిడి ఉన్నవి గనుక, 'పాండవాః' అనగా సాత్వికగుణములు అని అర్థము. నావారలు పాండవులును యుద్ధమునకు సన్నద్ధులై నారు అను శ్లోకములోని భావమునకు ఆధ్యాత్మికార్థము ఏమనగా, మనశరీరములోని రజోగుణ తమోగుణములకున్ను సాత్వికగుణములకున్ను, తగాదావచ్చినదని అర్థము; అనగా దైవసంపత్తునకు అసురసంపత్తునకు తగాదా లేక మంచిగుణములకు చెడ్డగుణములకు తగాదా. ఇట్టి తగాదా ప్రపంచములో ప్రతిమానవుని అంతఃకరణములోను ప్రతి నిమిషము జరుగుచున్న సంగతి అందరికీ తెలిసినదేగదా? అట్టి తగాదాలోనుంచి బయటపడి ధర్మమును జ్ఞానమును సంపాదించుకొని తరించుకొనుటకు సాధనములను తెలుసుకొనుటకే యీ ప్రశ్న పుట్టినది. చెడ్డగుణములకు మంచిగుణములకు తగాదా ఏలా వచ్చింది. ఏలావస్తుంది. ఏలాపోతుంది అను భావములు యీ మొదటి ప్రశ్నలో యిమిడియున్నవని అనుకోవచ్చును. ఇది 8వ అర్థము.

9. ఈ శ్లోకములోనికి 'మకుర్వత' అను శబ్దమును ఆక్షేపార్థముగా తీసుకొనినచో అధ్యాత్మికంగా వచ్చే అర్థమేమనగా నా శరీరమనే క్షేత్రము ధర్మము అనే పంటను పండించుటకుగాను భగవంతునిచే అనుగ్రహింపబడి యుండగా, నాలోని దుర్గుణములు సద్గుణములతో పోట్లాట పెట్టుకొని ధర్మమనే పంట పండకుండా చేసి, ఎంత అక్రమము చేస్తున్నవి! స్వామీ, దానిలోనుంచి బయటపడే ఉపాయము చెప్పండి అని అజ్ఞాని అయిన శిష్యుడు జ్ఞాని అయిన గురువును అడిగే ప్రశ్న. ఇది 9వ అర్థము.

Geetha Koumudi-1    Chapters